23, మార్చి 2015, సోమవారం

మధురగీతాలు - మధుర స్మృతులు

మనం ఎప్పుడూ ఏదో సమస్యల గురించి ఆలోచిస్తూ వుంటాం. కానీ మన జీవితంలోని మధుర స్మృతులలోకి వెడితే చాలా ఆనందించగలుగుతాం. ఈ మధుర గీతాల మధుర స్మృతులు ఏమిటంటే - నేనీ మధ్యన కంప్యూటర్ లో పాతపాటలు వింటూ వర్కు చేసుకుంటున్నానునా చిన్నప్పటి నుంచీ విన్న, నాకు నచ్చిన పాటలు అన్నీ నాకు యూట్యూబ్ లో దొరికాయి ఒక్క పాట తప్ప.
అయితే ఒక్కోపాట వింటూంటే నేను ఆనాటి సంఘటనల్లోకి వెళ్ళిపోయి ఎంతో ఆనందాన్ని పొందాను.
పాడవోయి భారతీయుడా.... ఆడిపాడవోయి విజయ గీతికా.... (1961) వెలుగు నీడలు
ముద్దబంతి పూవులో మూగకళ్ళ వూసులు..... (1964) మూగమనసులు
ఎంతవారలైన వేదాంతులైన గాని ఓరచూపు.... భలే తమ్ముడు
ఈ పాటలు వింటూంటే......
మా చిన్నప్పుడు వేసవి సెలవులకి మా తాతగారి వూరు పెనుగొండ (తణుకు దగ్గర) వెళ్లేవాళ్ళంవాళ్ళకి పెద్ద పెంకుటిల్లు ఉండేది. వెనకవైపు మల్లె, గులాబి, నందివర్ధనం మొదలైన పువ్వుల చెట్లు, ఆవులు, గేదెలు వుండేవి. ముందు వైపు చాలా ఎత్తైన కాంపౌండ్ వాల్ వుండేదిఆ గోడ మీద గిన్నె మాలతీ తీగలు అందమైన తెల్లటి పువ్వులతో సువాసనలు విరజిమ్ముతూ వుండేవి ముందు గుమ్మానికి ఉన్న మెట్లమీద సాయంత్రం నేను, మా తరవాత చెల్లెలు ప్రభావతి కూర్చునే వాళ్ళం. అయితే మాతాతగారు టైం పాస్ కి సినిమా హాల్లో మేనేజరుగా పనిచేసేవారుపనిమనిషి సాయంత్రం నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టేది. గోధూళి వేళ సాయంత్రం చల్లటి వాతావరణం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే  ఆ సినిమా హాల్లో మైక్ పెట్టి సినిమా మొదలయ్యే లోపున పాటలు వేసేవాళ్ళు. అవి దూరం నుంచీ చాలా ప్రశాంతంగా వినిపించేవి. ఈ పాత పాటలన్నీ వినేవాళ్ళం. అంత చిన్నప్పుడు కూడా అదెంతో హాయిగా ఆనందంగా అనిపించేదిఈ గతంలోకి వెళ్ళి ఆనందాన్ని పొందాను.
బలేతాత మన బాపూజీ బాలల తాతా బాపూజీ (1955) దొంగరాముడు
నేను వినే పాటల్లో ఈ పాట గుర్తు చేసుకుని విన్నాను. మా చిన్నప్పుడు మేము తాడేపల్లిగూడెంలో ఒక ఇంట్లో వుండేవాళ్ళం. మూడు వాటాల పెంకుటిల్లు. మా ఇంటి వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు. చిన్నబ్బాయి పేరు గోపి. కొంచెం అయోమయంగా వుండేవాడు. అప్పట్లో రేడియోలే కదా. వాళ్లింట్లో పెద్ద రేడియో వుండేదినేను వాళ్లింటికి వెడితే. స్టైల్ గా రేడియో దగ్గర నుంచుని ఇందులో నీకేం పాట కావాలో చెప్పు అన్నాడు. నేను బలే తాత మన బాపూజీ పాట పెట్టు అన్నానుతనకీ తెలియదు. ఎలా పెట్టాలో అవీ ఇవీ తిప్పేసి ఇప్పుడు వెయ్యరుట అన్నాడుతలుచుకుంటే నవ్వు వస్తుంది.
మేము కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక మా నాన్నగారు రేడియోలో పాటలు కూడా విననిచ్చేవాళ్ళు కాదు. అసలు రేడియో ఎలా పెట్టాలో కూడా తెలియదు. తను ఒక్కరే వినేవారు. మా నాన్నగారు నేను 7వ తగతిలో వుండగా పోయారు. నేను 10వ తరగతిలోకి వచ్చాక అప్పుడు మా అక్కలు రేడియో కొని వివిధ భారతిలో పాటలు వింటూంటే నేనూ వినేదాన్నిఅది కాకుండా వూళ్ళల్లో ఏ ప్రోగ్రాములైనా మైకులు పెట్టేసి పాటలు వేసేవాళ్ళు.

హే నీలే గగన్ కి తలే ధర్తీ కా ప్యార్ ఫలే (1967) హమ్ రాజ్
ఈ పాట మా పెద్దక్క అన్నపూర్ణకి చాలా ఇష్టం. నా పైన ముగ్గురు అక్కలచేత  మా నాన్నగారు హిందీ పరీక్షలకి కట్టించారు. భాషాజ్ఞానం కోసం హిందీ సినిమాలకి తీసుకెళ్ళేవాళ్లు. పెద్దక్క ఈ పాట బాగా వింటూండేది, పాడుతూండేది. మా ఇంటి దగ్గర ఎద్దనపూడి వాళ్ల కుంటుంబం వుండేది. వాళ్లూ ఐదుగురు అమ్మాయిలు వాళ్లల్లో అన్నపూర్ణ మా రెండవ అక్క క్లాస్ మేట్, సరస్వతి నా క్లాస్ మేట్, పెద్దమ్మాయి భాగ్యలక్ష్మి పెద్దక్క అన్నపూర్ణకన్నా సీనియర్. అందుకని తరచు వాళ్ళు మేము కలుసుకుంటూ వుండేవాళ్ళం. వాళ్ళ నాన్నగారికి లలిత కళలంటే ఇష్టంగా వుండేది. లలితకళా సమితి అని పెట్టి,  మీటింగులు పెట్టేవాళ్ళు. వాళ్ళది చాలా పెద్ద ఇల్లు. ఎప్పటి నుంచో వున్న వాళ్ళు కాబట్టి మీటింగులకి జనం బాగానే వచ్చేవారు. ఒకసారి అలాంటి మీటింగు పెట్టి మైకులో పాటలు అదరగొట్టేస్తున్నారు. మా పెద్దక్క ఈ పాట వెయ్యమని అడగమంది. చాలా చిన్న వాళ్ళం నేను, మా చెల్లెలు ప్రభావతి పరుగెత్తుకు వెళ్ళి హే లీచే లియే పాట వెయ్యండి అని అడిగాము.  వాడికి అర్థం అయ్యి పాట వేశాడు. మా అక్క చాలా సంతోషంగా వింది. ఇదీ తలుచుకుని నవ్వుకున్నాను.
గోపాల బాల నిన్నే కోరి నీ సన్నిధి చేరి నీ చుట్టే తిరుగుతు వుంటాను – (1969) భలే తమ్ముడు
మా నాన్నగారికి  మహమ్మద్ రఫీ పాడిన ఈ పాటంటే చాలా ఇష్టం.
మా ఇంటి రోడ్డులోనే  ఎద్దనపూడి వాళ్లలాగే బాగా సెటిలయిన కుటుంబం మామిడి వెంకటేశ్వర రావుగారు వాళ్ళు. వాళ్ళకి బట్టల కొట్టు వుండేది. అప్పట్లో అది చాలా గొప్పగా వుండేది. ఒక అమ్మాయి బొమ్మకి చీర కట్టి పెట్టడం మా వూళ్ళో వాళ్ళ షాపులోనే మొదలయ్యింది. దాన్ని చూడడానికి అస్తమానం వెళ్ళేవాళ్ళం. ఇంతకీ ఏమిటంటే వాళ్ళ అబ్బాయికి పెళ్ళయింది. ఆ పెళ్ళి అయ్యాక ఊళ్ళో వాళ్ళకి ఫంక్షన్ చేశారు. వాళ్ళ ఇంటికి కొద్ది దూరంలోనే ఒక పెద్ద కాంపౌండ్ వాల్, గేటుతో కొన్ని ఇళ్ళ సమూహంతో ఒక స్థలం వుండేది.  అక్కడ వాళ్ళు ఫంక్షన్ చేశారు. అప్పట్లో వాళ్లు సినిమా పాటలు పాడేవాళ్ళని పిలిపించి రకరకాల పాటలు పాడించారు. అది ఆ రోజుల్లో చాలా ఖర్చుతో కూడిన పని.  వాళ్ళు ఈ గోపాల బాల పాట పాడారు.  సినిమాలో రామారావు, కె.ఆర్. విజయ పాడిన పాట వాళ్ళు అలాగే పాడారు.  మా నాన్నగారు అబ్బా ఎంత బాగా పాడుతున్నారో అమ్మాయి కూడా బాగా పాడుతున్నట్లుంది అన్నారు. అయితే మేము చూసి వచ్చి అమ్మాయి లేదు నాన్నా అన్నాము. కానీ మా మీద నమ్మకం కలగలా. తనే వచ్చి పాటయ్యే వరకు నిలబడి విని చాలా ఆశ్చర్యపోయారు.  ఇప్పటికీ నేను ఆ పాట విని అవన్నీ తలుచుకుంటాను.

ఫూలోంకా తారోంకా సబ్ కా కహనా హై – (1971) హరే రామ హరే కృష్ణ
ఈ పాట చాలా అద్భుతమైన పాట. నా పైన ఉన్న ఇద్దరు అక్కలు రమ, ఉమ. వాళ్ళకి హసీనా అని ఒక అందమైన ముస్లిం స్నేహితురాలు వుండేది. మా ఢిల్లీ అక్క ఆ అమ్మాయిని తుమ్ హసీన్ మై జవాన్ అనేది. వాళ్ల చెల్లెలు ఈ పాట పాడగా వాళ్ళు విని నాకు ఇంటికి వచ్చి చెప్పారు. అయితే ఒకరోజు ఆ ముస్లిం అక్కచెల్లెళ్ళు ఇద్దరూ మా యింటికి వచ్చారు. అప్పుడు ఆ అమ్మాయిచేత ఫూలోంకా తారోంకా సబ్ కా కహనా హై పాడించుకున్నాను. చాలా బాగా పాడింది. అది అలా గుర్తుండిపోయింది. అప్పటి నుంచి పూర్తి పాట విందామని అనుకున్నాను. కుదరలేదు. ఇప్పుడు విని ఆనందించాను.

ఆరిపేయవె దీపమూ ఎలుగులో నీ మీద నిలపలేనే మనసు – ఎంకి పాట
కొమ్మలో కోయిలా కో యంటదే...  – నండూరి సుబ్బారావుగారి ఎంకి పాట
నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా కాలేజీ సినిమా పాటలు పాడే ఆనంద్ గారు వచ్చారు. ఆయన చాలా పాటలు పాడారు. ఆయన ఎవరైనా పాటలు పాడేవాళ్లుంటే పాడండి అంటే నేను ఈ రెండు పాటలూ పాడాను. చాలా మెచ్చుకున్నారు.  నేను కాలేజీలో ఏదో ఒక సందర్భంలో పాటలు పాడుతూ వుండేదాన్ని.
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా.... – అమెరికా అమ్మాయి
ఆనంద్ పాడిన పాట. సంవత్సరం గుర్తులేదు.
మా వూళ్ళో వుమెన్స్ కాలేజీ కొత్తగా పెట్టారు. ఆ కాలేజీకి మేము ఫస్ట్ బాచ్. మేము డిగ్రీలో ఏడుగురం అమ్మాయిలం వుండేవాళ్ళం.  మా లెక్చరర్స్ కి మేమంటే చాలా ఇష్టంగా వుండేది. డిగ్రీ మూడవ సంవత్సరంలో వుండగా మాకు ఫేర్ వెల్ ఇవ్వడానికి మా లెక్చరర్స్ వాళ్ల ఇంటికి పిలిచారు. సరదాగా ఇంట్లో పాటలు పాడుకున్నాం. కబుర్లు చెప్పుకున్నాం. అదొక మధుర స్మృతి. ఆ సమయంలో మా పాలిటిక్స్ మేడం ఒక వేణువు వినిపించెను పాట పాడారు. చాలా బాగా పాడారు. నాకు అది అది నచ్చింది. నేను వెంటనే నేర్చుకుని చాలా చోట్ల పాడాను. అందరూ మెచ్చుకున్నారు. నేను ఆ పాట కోసం చాలా వెతికాను. ఈ మధ్య యూట్యూబ్ లో విని చాలా సంతోషించాను. అంతే కాకుండా కాలేజి స్మృతుల్లో మునిగి తేలాను. ఆ పాట వింటుంటే ఎంత హాయిగా వుందో.
చిలకమ్మ చెప్పిందోయ్ చల్లని మాట, నా కలలన్ని త్వరలోన పండేనట ఈ పాట ఏ సినిమాలోదో తెలియదు.
మేము డిగ్రీ చదువుతున్నప్పుడు కార్తీకమాసం పిక్ నిక్ పోగ్రాం వేశారు. అయితే మేము అనుకున్న రోజుకి రెండు రోజుల  ముందు నుండి తుఫాను మొదలయ్యి వర్షం ఆగకుండా సన్నని తుంపర పడుతోంది. దానితోబాటు గాలి. మా కాలేజి రిప్రజెంటేటివ్ ఉషశ్రీ ప్రిన్సిపాల్ శేషూ అయ్యంగార్ దగ్గరకి వెళ్ళి ఇంకో రోజు పెట్టుకుందాం అంది. కానీ ఆయన ఒప్పుకోలేదు. అందరూ ఎగిరారుగా నడవండి అన్నారు. ఇంక చేసేది లేక అందరూ బాచ్ లు బాచ్ లు గా నడుచుకుంటూ ఊరి బయట మామిడి తోటకి బయల్దేరాం. ఆ సన్నటి వర్షంలో హాయిగానే వుంది. అక్కడ ఆ తోట యజమానులకి పెద్ద పెంకుటిల్లు వుంది. వాళ్ళు మా అందరికీ అంటే ఇంచుమించు 200 మందికి అందులో కూచోవడానికి అనుమతిచ్చారు. అందరం గ్రూపులు గ్రూపులుగా కూచుని కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకున్నాం. ఆ టైములో మా రిప్రజెంటేటివ్ ఉషశ్రీ చెల్లెలు సుధశ్రీ చిలకమ్మ చెప్పిందోయ్ పాట చాలా చక్కగా పాడింది. పాట స్టయిల్ చాలా బాగుంటుంది. ఆ పాట పూర్తిగా దొరికితే బాగుండును అనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఆ పాటలోలాగా కలల రాజకుమారుడు వచ్చాడు. మా వనమహోత్సవం గురించి రాయాలంటే చాలా పేజీలు అవుతుంది. అప్పుడు రకరకాల అనుభూతులు.  ఆ పాట తలుచుకుంటే ఆ తుఫాను, ఆ రోజులు గుర్తుకు వస్తాయి. వర్షం పెద్దదయ్యేసరికి మా అందరికీ క్రోసిన్ టాబ్లెట్లు కొనిచ్చి, లారీలో అందరినీ ఎవరి ఇళ్ళదగ్గర వాళ్ళని దింపారు. నన్నయితే ఇంచుమించు కిలో మీటరు దూరంలో వర్షంలో దింపేసి పోయారు. రాత్రి 7 గంటల సమయం. రోడ్డు మీద ఎవరూ లేరు. 19 సంవత్సరాల వయస్సు. చీకట్లో, వర్షంలో ఒక్కదాన్నీ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాను. ఆ రోజులు కాబట్టి, ఊళ్ళో అందరికీ మేమందరం బాగా తెలుసు కాబట్టి సేఫ్ గా ఇంటికి చేరాను. అమ్మ వేడి వేడి నీళ్ళు స్నానానికి రెడీ చేసింది. స్నానం చేసి అమ్మ పెట్టిన వేడన్నం తిని నిద్రపోయాను. భలే అనుభూతి.
ఆనాటి చెలిమి ఒక కల, కలకాదు నిజము ఈ కల (1968) పెళ్ళిరోజు
ఈ పాట వినగానే మా ఫేర్ వెల్ రోజులు గుర్తుకు వచ్చాయి. మా డిగ్రీ చివరలో కాలేజీలో మా జూనియర్స్ ఫేర్ వెల్ పార్టీ ఇచ్చారు.  ఈ పాటని మా పెద్దక్క అన్నపూర్ణ మా  స్టూడెంట్స్ కి తగినట్లుగా మార్చి రాసి నాకు నేర్పింది. నేను మా పార్టీలో పాడాను. అందరూ చాలా సంతోషించారు.
పాండవులు పాండవులు తుమ్మెదా... పంచపాండవులోయమ్మ తుమ్మెద.... అక్క చెల్లెలు
ఈ పాట వినగానే మా టెన్త్ క్లాస్ రోజులు గుర్తుకు వస్తాయి. మా క్లాసులో నేను, సరస్వతి  ఒక బెంచీమీద కూర్చునేవాళ్ళం.     ఒక రోజు మాథ్స్ క్లాస్ జరుగుతోంది. అందరికీ మా మాస్టారు ఒక లెక్క ఇచ్చి చెయ్యమన్నారు. సరస్వతి ఆన్సర్ వచ్చేసిందిట ఉన్నట్టుండి పాండవులు పాండవులు తుమ్మెదా...  అని గట్టిగా పాడేసింది. నేను నవ్వాపుకోలేక గట్టిగా నవ్వేశాను. తనూ నవ్వింది. కానీ మా ఇద్దరినీ క్లాసయ్యేవరకూ మా మాస్టారు నిలబెట్టారు.











కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి